మైనర్ బాలిక ఆత్మహత్య.. బైరెడ్డిపల్లి మండలంలో విషాదం
బైరెడ్డిపల్లి, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని చప్పిడిపల్లి గ్రామపంచాయతీ జంగాల అగ్రహారం గ్రామంలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడులోని గుడియాతానికి చెందిన హరికృష్ణ కుమార్తె బృంద (17)ను, జంగాల అగ్రహారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రఘు ప్రేమ పేరుతో తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. కుమార్తె కానరాకపోవడంతో తండ్రి హరికృష్ణ ఆరా తీయగా, రఘు ఆమెను తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడగా బాలికకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాలిక వినకపోవడంతో రఘు వద్దే వదిలేసి వెళ్లారు.
ఈ సంఘటన జరిగి నాలుగు నెలలు గడుస్తుండగా, ఇటీవల బృంద తన తల్లిదండ్రులకు వర్తమానం పంపింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని, వచ్చి తీసుకెళ్లాలని కోరింది. కుటుంబ సభ్యులు స్పందించేలోపే బృంద ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై మృతురాలి తండ్రి హరికృష్ణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తీరుపై స్థానికుల విమర్శలు..
మైనర్ బాలికల విషయంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు గ్రామ పోలీసులు, సంబంధిత యంత్రాంగం సరిగ్గా స్పందించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలతో సరిపెట్టకుండా, మైనర్ బాలికల రక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
