జైనూరులో భారీ వర్షం.. రైతన్న హర్షం !
- అరగంటపాటు కుండపోత..
- రోడ్లపై వరద నీరు
- ఖరీఫ్ పంటలపై చిగురిస్తున్న ఆశలు
జైనూర్, ఆంధ్రప్రభ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇదే తొలి భారీ వర్షమని రైతులు, స్థానికులు తెలిపారు. దాదాపు అరగంటకు పైగా కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు ఏరులై పారింది.
కొంతకాలంగా తగినంత వర్షాలు లేక ఖరీఫ్ సాగుపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, ఈ వర్షంతో ఉపశమనం పొందామని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలి రోజుల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ, సోమవారం కురిసిన భారీ వర్షం సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. ఈ వర్షంతో భూమిలో తేమ పెరిగి ఖరీఫ్ పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
