ఉమ్మడి గుంటూరు జిల్లాలో జోరుగా ఆకుకూరల సాగు

  • రోజుకు 50 లక్షలకు పైగానే వ్యాపారం
  • తక్కువ నీటి సదుపాయంతోనే పంటల సాగు

గుంటూరు ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: వాణిజ్య పంటల సాగు పేరుతో లక్షలకు లక్షలు అప్పు చేయాల్సిన పనిలేదు.. ఉన్న కొద్దిపాటి భూమిలోనే సాగునీటి వనరులు అందుబాటులో ఉంటే.. ఏడాది పొడవునా రైతులకు ఆ పంటలు సిరులు కురిపిస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలకు ప్రధాన భూమిక పోషించే ఆకుకూరలు సాగు రైతులకు మనోధైర్యం కల్పిస్తుంది. వైద్యులు సైతం ఆకుకూరల వినియోగంపై సూచిస్తున్న నేపథ్యంలో, పంట పండిస్తున్న రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. చూసేవాళ్లకు ఆకుకూరల సాగు చిన్న పంటలా కనిపిస్తున్నా, పండిస్తున్న రైతులకు మాత్రం ఆదాయం పరంగా తృప్తినిస్తుంది. అప్పుల కోసం ఎవరి వద్ద చేతులు చాచే పరిస్థితి ఉండదని పలువులు రైతులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తీవ్ర వర్షాభావం నేపథ్యంలో, పంట పొలాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పొలం పనులు వద్ద బిజీగా ఉన్నది మాత్రం, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్న రైతులు మాత్రమే.గుంటూరు, బాపట్ల, పలనాడు జిల్లాల పరిధిలో కొన్ని గ్రామాలు పూర్తిగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాయి. వీళ్ళు చేస్తున్న వ్యాపారం తక్కువేమీ కాదు. రోజుకు 50 లక్షలకు పైగానే లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా.

ఆకుకూరలు, కూరగాయల సాగుతో బిజీ

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో పరిశీలిస్తే కొన్ని గ్రామాలలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తాటికొండ, మంగళగిరి పరిధిలో తోటకూర, మెంతుకూర, కొత్తిమీర, పుదీనా సాగు రైతులు చేపట్టారు. ప్రత్తిపాడు మండలంలో బచ్చలి కూర, పాలకూర పండిస్తారు. పొన్నూరు, కొల్లూరు, వేమూరు (కృష్ణ డెల్టా) ప్రాంతాలు వాణిజ్య స్థాయిలో వివిధ రకాల ఆకుకూరలు పండిస్తుంటారు. తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర ప్రాంతాలలో కొత్తిమీర, మెంతుకూర, గోంగూర, పాలకూర తో పాటు వివిధ రకాల ఆకుకూరల సాగు చేస్తున్నారు. చేబ్రోలు మండలంలో ఆకుకూరలతో పాటు వివిధ రకాల కూరగాయలు పండిస్తూ మిశ్రమ సాగు చేపట్టారు.

గుంటూరు సమీపంలోని ఫిరంగిపురం వద్ద ఆకుకూరల సాగు విస్తీర్ణం ఎక్కువే. పల్నాడు జిల్లాలోని మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో ఆకుకూరల సాగు అందుబాటులో ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఆకుకూరల సాగు పరిశీలిస్తే 6వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. నారాకోడూరు కూరగాయల సాగులో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కూరగాయల సాగు విస్తీర్ణం తక్కువ ఏమీ కాదు. రైతుకు మాత్రం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర సాగు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. వేసవికాలం మాత్రం పుదీనా, కొత్తిమీర తిరుపతి వైపు నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంది. మిగతా రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని రైతులే సాగు చేస్తుంటారు.

నీటి వనరులు ఒడిసిపట్టి పండిస్తున్నారు..

ఆకుకూరలు సాగు ప్రధానంగా వ్యవసాయ బోర్లు నమ్ముకుని రైతులు చేస్తున్నారు. మిర్చి ఇతర వాణిజ్య పంటలకు అవసరమైన నీళ్లు ఆకుకూరసాగుకు అవసరం లేదు. దీంతో రైతులు బోర్ల నుంచి కొద్దిపాటి నీరు వస్తున్నా, ఆ నీటిని ఒడిసిపెట్టి ఏడాది పొడవునా ఆకుకూరలు సాగు చేస్తూనే ఉంటారు. కృష్ణ డెల్టా వైపు పై భాగంలోని బోర్లకు నీరు అందుతుంది. దీంతో రైతులు ఆకు కూరలతోపాటు, కూరగాయలు సాగు చేసేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు ఆకుకూరలు, కూరగాయలు పండించే రైతులు సొంతగా బోరు అందుబాటులో ఉంచుకుంటారు. ప్రస్తుతం పగటిపూట విద్యుత్తు అందుబాటు ఉండడంతో, రైతులు పగల మొత్తం పొలాల వద్దనే బిజీగా ఉంటున్నారు. ఒకవైపు ఆకుకూరలు విక్రయాలకు సిద్ధం చేస్తుంటారు.

మరో వైపు విక్రయాలు కోసం కట్ చేసిన ఆకుకూరలు, తిరిగి మరో నాలుగు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. రైతులు ఇందుకు అనుగుణంగా సాగు చేపడతారు. మడుల రూపంలో ఆకుకూరలు, కరివేపాకు పెంచుతుంటారు. అవసరమైనప్పుడు నీళ్లు పెట్టడం పురుగు వ్యాప్తి చెందకుండా, క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు. రైతు తన సామర్థ్యాన్ని బట్టి 25 సెంట్లు నుంచి,రెండు ఎకరాలకు పైగా ఆకుకూరలు సాగుకు కేటాయిస్తున్నారు. కొందరు రైతులు మార్కెట్ కు వెళ్లి విక్రయిస్తుండగా, కొన్నిచోట్ల వ్యాపారులే పొలాల వద్దకు వచ్చి ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లో మాత్రం కొందరు రైతులు వారే నేరుగా ఆకుకూరలు విక్రయించుకుంటున్నారు. పొలాల వద్ద రైతుల నుంచి ఆకుకూర కట్ట నాలుగు నుంచి ఐదు రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. విడిగా ప్రజలకు అమ్మేది మాత్రం కట్ట పది రూపాయలు. కొందరు రైతులు నేరుగా తామే విక్రయించుకుంటే పది రూపాయలు మిగులుతాయని ప్రజల వద్దకు వస్తున్నారు. ఆకుకూరల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్ కు ఉదయం, సాయంత్రం సమయం లో అందుబాటులోకి వస్తున్నాయి.

ఆకుకూరల మార్కెట్ తక్కువేమీ కాదు..

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆకుకూరల సాగును పరిశీలిస్తే దానికున్న మార్కెట్ తక్కువేమీ కాదు. ప్రతిరోజు విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, నర్సరావుపేట, బాపట్ల,పొన్నూరు,చీరాల, రేపల్లె, తాడేపల్లి, మాచర్ల ప్రాంతాల పరిశీలిస్తే ఆకుకూరల ఆదాయం తక్కువేమీ కాదు. పండిస్తున్న రైతులు మార్కెట్ కు ఆకుకూరలు తీసుకొస్తున్నారు. కొందరు రైతులు ఏ రోజుకు ఆరోజు డబ్బులు తీసుకుంటుండగా, మరి కొందరు వారానికి ఓసారి వ్యాపారం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక రైతు 300 కట్టల ఆకుకూరలు మార్కెట్ కు తీసుకొస్తే,వెంటనే 1500 నుంచి 1600 డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. కొత్తిమీర, పుదీనా పండిస్తున్న రైతుకు మరింత అదనంగా ఆదాయం సమకూర్తుంది. ఇలా ప్రతి పట్టణంలో ప్రస్తుతం ఆకుకూరల విక్రయాలు మార్కెట్లో జరుగుతున్నాయి. పట్టణాలకు సమీప గ్రామాల్లో పండించి మార్కెట్ కు తీసుకువస్తున్నారు.

ఇలా విక్రయాలు జరుగుతున్న ఆకుకూరలు, కరివేపాకు, పుదీనా,కొత్తిమీర విలువ ప్రతిరోజు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక కూరగాయల విక్రయాల గణంకాలు చూస్తే మరో 20 లక్షలు అదనంగా చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఇటీవల వైద్యుల సూచన మేరకు ఆకుకూరల వినియోగం గణనీయంగా పెరిగింది. చిన్నారుల నుంచి వృద్దుల వరకు తప్పనిసరిగా ఆకుకూరలు తీసుకోవాలని వైద్యులు ప్రధానంగా చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతో పాటు వినియోగం ప్రతిఏటా పెరుగుతుంది.

15 ఏళ్లుగా వెనుతిరిగి చూడలేదు- లింగారెడ్డి

తాను 15 ఏళ్లుగా ఆకుకూరలు సాగులోనే నిమగ్నమయ్యానని రైతు లింగారెడ్డి అన్నారు. ఆదాయం పరంగా ఏడాది పొడవన డోకా ఉండదని చెప్పారు. రైతులే సొంతగా పట్టణాల్లో అమ్ముకోగలిగితే లాభాలు అదనంగా వస్తాయన్నారు. మార్కెట్ కు తీసుకువెళ్లి విక్రయించడం వలన తక్కువ రేటు అయినా వెంటనే డబ్బులు వస్తాయని చెప్పారు.తాను 25సెంట్లు భూమిలో ఆకుకూరలు పండిస్తున్నట్లు చెప్పారు. ఆదాయం పరంగా సంతృప్తి గా ఉందన్నారు.