దరఖాస్తులకు ఆహ్వానం..
నర్సాపురం, ఆంధ్రప్రభ : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏలూరు ఆదేశాల మేరకు నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థలో స్వచ్ఛంద న్యాయ సేవా కార్యకర్తలుగా (పీఎల్వీలు) శిక్షణ పొందేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నర్సాపురం పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎ. వాసంతి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
కనీసం పదో తరగతి విద్యార్హత కలిగి, ఎటువంటి ధనార్జన ఆశించకుండా సేవా దృక్పథంతో ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
నర్సాపురం, యలమంచిలి, మొగల్తూరు మండలాల పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు, న్యాయ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు, సామాజిక సేవకులు, వైద్యులు, రాజకీయేతర వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, డ్వాక్రా మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను నర్సాపురం కోర్టు ప్రాంగణంలోని మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 7వ తేదీలోపు అదే కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం నర్సాపురం కోర్టు ప్రాంగణంలోని లీగల్ సర్వీసెస్ కార్యాలయాన్ని లేదా 08814-273900 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని న్యాయమూర్తి ఎ. వాసంతి విజ్ఞప్తి చేశారు.
