గడువులోగా అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
- జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. ప్రజా అర్జీల పెండింగ్ కేసులు పేరుకుపోయే పరిస్థితిని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ మేరకు ఆయన ఇన్చార్జి డిఆర్ఓ ఎస్ పోతురాజు, కేఆర్ఆర్సి ఎస్డిసి పి నీలకంఠేశ్వర రెడ్డి, చిలకలపూడి సిఐ ఎస్కే అబ్దుల్ నబీతో కలసి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి శాఖ అధికారి వారానికి ఒకసారి పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించి పారదర్శకంగా, నాణ్యతతో సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అర్జీలలో కొన్ని..
- పామర్రు మండలం ఐనంపూడి గ్రామంలో తాగునీటి ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమై వినియోగానికి అనర్హంగా మారిందని, అలాగే డ్రైనేజీ సమస్యతో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి అధికమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామానికి చెందిన భట్టు వీర రాఘవులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించారు. ఈ సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ, వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు
- పెడన మున్సిపాలిటీ 2వ వార్డు భోజనగుడి రోడ్డు సమీపంలో గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్, చనిపోయిన జంతువుల కళేబరాలు, ఇతర చెత్తాచెదారాలను వేయడంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డుగా మారి దుర్వాసన వెదజల్లడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని స్థానిక ప్రజలు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించారు. ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
