విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం
కంకిపాడు, ఆంధ్రప్రభ: కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)ను సోమవారం సందర్శించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తూ వారి విద్యాభ్యాసం, పాఠశాల వాతావరణం, మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర అంశాలపై ఆప్యాయంగా ముచ్చటించారు.
విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రతపై కలెక్టర్ ఆరా తీశారు. భోజనం రుచి, నాణ్యత ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన, చదువుపై ఆసక్తి వంటి అంశాలపై కూడా విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రోత్సహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
