అనంతపురం ఎయిర్‌పోర్టుకు మళ్లీ ఆశలు..!
- ఎయిర్‌పోర్టుపై కేంద్రానికి విజ్ఞప్తి
- ఉద్యాన పంటల ఎగుమతులకు ఎయిర్‌పోర్టు అవసరమన్న పయ్యావుల
- రామ్మోహన్ నాయుడిని కలిసిన పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
- 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: అనంతపురం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో చుట్టుపక్కల కొండలు ఉండడం వల్ల రెండు వైపులా విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం లేదని ఏవియేషన్ అధికారులు నివేదిక ఇచ్చిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
అయితే విశాఖపట్నం పాత విమానాశ్రయంలో అమలు చేసినట్లుగా వన్‌సైడ్ ల్యాండింగ్ విధానంలో రన్‌వే ఏర్పాటు చేసిన తరహాలో కూడేరు ప్రాంతంలో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానయానాన్ని మరింత విస్తరించేందుకు చేపట్టిన చర్యలను కూడా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు.
రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 100 ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉడాన్ పథకాన్ని అనంతపురానికి వర్తింప చేయాలని పయ్యావుల కోరారు. అనంతపురం జిల్లా దేశంలోనే ఉద్యాన పంటల సాగులో అగ్రగామి జిల్లాల్లో ఒకటని, పెద్దఎత్తున ఇక్కడి నుంచి వివిధ మార్కెట్లకు తరలుతున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో హార్టికల్చర్ కార్గోకు విస్తృత అవకాశాలు ఏర్పడి, రైతులు తమ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందని, తద్వారా మెరుగైన గిట్టుబాటు ధరలు లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని వివరించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ దిశగా చేపడుతున్న కార్యక్రమాలకు అనంతపురంలో ఎయిర్‌పోర్టు కీలక మౌలిక వసతిగా నిలుస్తుందని పయ్యావుల తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సర్వే నిర్వహించి 30 రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.

