ఈఎస్ఐ ఆసుపత్రి విస్తరణకు ఎంపీ చిన్ని చొరవ

  • 300 పడకల తృతీయ స్థాయి వైద్యశాల, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేంద్రానికి విజ్ఞప్తి
  • ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్ర మంత్రి మాండవియాను కలిసిన ఎంపీ
  • గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధితో లక్షలాది బీమా కార్మికులకు మెరుగైన వైద్యం
  • 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో విస్తరణకు అనుకూల పరిస్థితులు
  • ఎంపీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

( విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడలోని గుణదల ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల తృతీయ స్థాయి (టెర్షియరీ కేర్) వైద్యశాలగా అభివృద్ధి చేయడంతో పాటు, అదే ప్రాంగణంలో ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను పార్లమెంట్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరతపై అధ్యయనం చేసి పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఎంపీ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడం ఈఎస్ఐ లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తించింది. ఎంపీ చిన్ని వినతిపత్రంలో, 1968లో స్థాపించబడిన విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి దాదాపు ఆరు దశాబ్దాలుగా ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం పరిధిలోని కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తోందని వివరించారు. ప్రస్తుతం 110 పడకల సామర్థ్యంతో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి-గైనకాలజీ, పీడియాట్రిక్స్, అత్యవసర వైద్యం, నిర్ధారణ సేవలు తదితర విభాగాల్లో ద్వితీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు ఇది సరిపోవడం లేదని పేర్కొన్నారు.

ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన సుమారు 2.88 లక్షల మంది బీమాదారులు, దాదాపు 10 లక్షల మంది ఆధారిత లబ్ధిదారులకు ఈ ఆసుపత్రి సేవలు అందిస్తోందని వివరించారు. విజయవాడ ప్రాంతంలో పారిశ్రామికీకరణ, వాణిజ్య సంస్థల విస్తరణతో ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఆసుపత్రి విస్తరణ అత్యవసరమైందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే సుమారు 25 ఎకరాల భూమి అందుబాటులో ఉండటం ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద బలమని ఎంపీ పేర్కొన్నారు.

అదనపు భూసేకరణ అవసరం లేకుండానే ఆధునిక 300 పడకల టెర్షియరీ కేర్ ఆసుపత్రి, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీని నిర్మించేందుకు అవసరమైన స్థలం సిద్ధంగా ఉందని, దీంతో కేంద్ర ప్రభుత్వ వ్యయం, సమయం రెండూ ఆదా అవుతాయని వివరించారు. ఈ ప్రతిపాదన అమలైతే కోస్తా ఆంధ్రలోని లక్షలాది బీమా కార్మికులు, వారి కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలు అందడంతో పాటు వైద్య విద్యకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఎంపీ చిన్ని తెలిపారు. వినతిపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది.