పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆదేశాల మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తాటి కృష్ణ మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, నల్లబెల్లి జడ్పీటీసీగా, నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దేవస్థాన పూజారులు పాల్గొన్నారు.
