జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి

బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష పిలుపు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో నిర్వహించనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్‌పర్సన్ దాసరి ఉష పిలుపునిచ్చారు.

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి ఉష మాట్లాడుతూ.. బీపీ మండల్ డే సందర్భంగా నిర్వహించే ఈ మహాసభకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వ సాధన కోసం బీసీలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళా కన్వీనర్ సిరవేణి స్వప్న, రాష్ట్ర కార్యదర్శి కన్నా రమేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ రమేష్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, జిల్లా యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.