బీఎల్ఓ విధులతో అంగన్వాడీ టీచర్లపై పెరుగుతున్న భారం
విద్య, పోషకాహార సేవలు దెబ్బతింటున్నాయని ఆందోళన..
బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి
మహమ్మదాబాద్, ఆంధ్రప్రభ : బీఎల్ఓ (ఎస్‌ఐఆర్) విధులతో అంగన్వాడీ టీచర్లపై తీవ్రమైన పని భారం పడిందని, దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యాబోధనతో పాటు పోషకాహార సేవలు కూడా దెబ్బతింటున్నాయని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా చిన్నారులకు ఆటలు, పాటలు, అక్షరాభ్యాసం, ప్రాథమిక విద్య బోధించే అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం బీఎల్ఓ విధుల కోసం ఇల్లు–ఇల్లు తిరగాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల చిన్నారుల హాజరు తగ్గిపోతోందని, పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన గుడ్లు, బాలామృతం, ఇతర పోషకాహార పదార్థాల పంపిణీ, పిల్లల బరువు నమోదు, ఫేస్ క్యాప్చర్ వంటి సేవలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నామని టీచర్లు చెబుతున్నారు. సకాలంలో పౌష్టికాహారం అందక గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్రంలోని టీటీడీ గుట్ట అంగన్వాడీ కేంద్రం–3లో విధులు నిర్వహిస్తున్న ఓ టీచర్ బీఎల్ఓ డ్యూటీలో ఉండటంతో కేంద్రానికి హాజరు కాలేకపోయారు. అదే సమయంలో కేంద్రాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్ పరిశుభ్రత, పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో ఆ టీచర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.
ఉదయం నుంచి రాత్రి వరకు బీఎల్ఓ విధుల్లోనే ఉండాల్సి వస్తోందని, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే అవకాశం లేక పిల్లలకు బోధన అందించలేకపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వహించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, కుటుంబానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నామని తెలిపారు.
పరిగి నియోజకవర్గంలో బీఎల్ఓ విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బందికి తగిన భత్యాలు కూడా అందడం లేదని వారు పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా బోధన, పోషకాహార సేవలు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని సమీక్షించి అంగన్వాడీ టీచర్లను బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని తల్లిదండ్రులు, టీచర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
