మండవల్లికి ప్రత్యేక అధికారిని నియమించాలి…

తహసీల్దార్ లేదా ఎంపీడీవోను ప్రత్యేక అధికారిగా నియమించాలి
కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి


మండవల్లి, జులై 27 (ఆంధ్రప్రభ ): మండవల్లి మండల కేంద్ర గ్రామపంచాయతీకి తహసీల్దార్ లేదా ఎంపీడీవోను ప్రత్యేక అధికారిగా నియమించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సామాజిక కార్యకర్తలు ఎల్.ఎస్. భాస్కరరావు, టి. అప్పారావు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం మండవల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తహసీల్దార్ బాజీ సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మండవల్లి గ్రామపంచాయతీలో సుమారు 7 వేల మంది జనాభా ఉండటంతో పాటు వ్యాపార లావాదేవీలు, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. రోజువారీ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.

మండలంలోని 29 గ్రామపంచాయతీలకు మండవల్లి ప్రధాన కేంద్రంగా ఉండటంతో పారిశుద్ధ్యం, వీధిదీపాలు, తాగునీటి సరఫరా, ప్రభుత్వ నిధుల సద్వినియోగం, గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని వివరించారు. సాధారణ అధికారులతో పోలిస్తే గెజిటెడ్ హోదా కలిగిన తహసీల్దార్ లేదా ఎంపీడీవోకు ఉన్న అధికారాలు, పరిపాలనా అనుభవంతో గ్రామ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరడంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మండవల్లి మండల కేంద్ర గ్రామపంచాయతీకి తహసీల్దార్ లేదా ఎంపీడీవోను ప్రత్యేక అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.