ప్రజల గడపలోకి కూటమి ప్రచారం..
- రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
- భవానీపురంలో బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
- సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు వివరణ
- స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ
- 40 రోజులపాటు పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో కార్యక్రమం
విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటి ప్రచారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో భవానీపురం 40వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో స్థానికులు ప్రస్తావించిన పెన్షన్లు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

రానున్న 40 రోజులపాటు పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ప్రతి ఇంటిని చేరుకోవడంతో పాటు ప్రజా సమస్యలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రచార కార్యక్రమం సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందన్నారు. అప్పుల భారంలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ, ‘తల్లికి వందనం’, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు మళ్లీ వేగం తీసుకొచ్చామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, శాంతిభద్రతల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన బుద్దా వెంకన్న, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని బుద్దా వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
