Indrakeeladri | వైభవంగా శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం..
- ఇంద్రకీలాద్రిపై సర్వాంగ సుందరంగా అలంకరణ..
- ప్రధానాలయంతో ఉప ఆలయాలు కూడా కూరగాయలతో అలంకరణ..
- 32 టన్నుల కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో..
- శాకాంబరి అవతారంలో కనువిందు చేసిన జగజ్జనని
- ఎంతో ప్రత్యేకం కదంబ ప్రసాదం.
- మూడు రోజులపాటు ఆధ్యాత్మిక వైభవం
Indrakeeladri | ( ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ ) : ఆహార భద్రత, సమృద్ధి, సస్యశ్యామలతకు ప్రతీకగా భావించే శాకాంబరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ భక్తులకు దివ్య దర్శనమివ్వడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రారంభమైన మూడు రోజుల శాకాంబరి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 32 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌తో మూలవిరాట్, ఉత్సవమూర్తులు, ప్రధాన ఆలయం, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా అలంకరించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దాతలు, రైతుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. శాకాంబరి ఉత్సవాలు అన్నదాతలకు, వ్యవసాయ సంపదకు, సమృద్ధి వర్షాలకు ప్రతీకగా నిర్వహించే విశిష్ట ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందాయి.

వైభవంగా మూడు రోజులపాటు..
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని శాకాంబరి దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకుకూరలు, దుంపకూరలు, గుమ్మడికాయలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయలు, టమాటాలు, అరటిపండ్లు, ద్రాక్ష, యాపిల్, దానిమ్మతో పాటు పలు రకాల పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో రూపొందించిన అలంకరణ ఆలయానికి ఆధ్యాత్మిక సోయగాన్ని తీసుకొచ్చింది.

అన్నపూర్ణ స్వరూపిణిగా..
శాకాంబరి దేవి పురాణ ప్రాశస్త్యానికి అనుగుణంగా భూమిపై కరువు తొలగించి జీవరాశులను కాపాడిన అన్నపూర్ణ స్వరూపిణిగా అమ్మవారిని ఈ ఉత్సవాల్లో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలకు అన్నపానాదులు సమృద్ధిగా లభించాలని కోరుతూ ప్రత్యేక హోమాలు, పూజలు, వేదపారాయణాలు నిర్వహించడం ఈ ఉత్సవాల విశిష్టత.

విశిష్టమైన కథంబ ప్రసాదం..
ఉత్సవాల్లో అత్యంత ఆదరణ పొందే కదంబ ప్రసాదం కోసం భక్తులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. బియ్యం, పప్పులు, సీజనల్ కూరగాయలు, గుమ్మడికాయ, జీడిపప్పు, నెయ్యితో తయారుచేసే ఈ ప్రసాదం శాకాంబరి ఉత్సవాల్లో మాత్రమే లభించే ప్రత్యేక నైవేద్యంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లేందుకు భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యేక ఏర్పాట్లు..
దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదం, కదంబ ప్రసాద పంపిణీ, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందిస్తున్నారు. కదంబ ప్రసాద్ పంపిణీ పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ ఈవో శీనా నాయక్ ప్రధానార్చకులు దుర్గాప్రసాద్ ప్రారంభించారు.

