congress| బీఆర్ఎస్‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్

congress| బీఆర్ఎస్‌పై మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్

కృష్ణా జలాలపై మాట్లాడే హ‌క్కు బీఆర్ఎస్‌కు లేదు
ప్లకార్డులతో ప్రజలను మోసం చేయొద్దు
పాలమూరుకు శాశ్వత నీటి పరిష్కారమే లక్ష్యం
మంత్రి వాకిటి శ్రీహరి
శాశ్వత నీటి పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : పాలమూరు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి “కర్ణాటకలో నీళ్లు – తెలంగాణలో బీళ్లు” అంటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రచారం రైతుల ప్రయోజనాల కోసం కాదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ఒక్కరోజైనా వెళ్లి ప్రశ్నించలేదని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేయడం ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. కృష్ణా జలాల అంశంపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని ఆయన అన్నారు.

జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వాకిటి శ్రీహరి విమర్శించారు. భీమా, కృష్ణా నదులపై బ్యారేజ్-కమ్-బ్రిడ్జిల నిర్మాణం ద్వారా నీటిని నిల్వ చేసి సాగునీరు, తాగునీరు అందించాలనే ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వానికి రాలేదన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసిందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కే. శివకుమార్, అక్కడి సాగునీటి శాఖ మంత్రులతో కలిసి ప్రతిపాదిత ప్రాంతాలను హెలికాప్టర్‌లో పరిశీలించి సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.

జూరాల ముంపు గ్రామాలైన భూత్పూర్, నేడుగం, అనుగొండ, అంకెనపల్లి, దాదంపల్లి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. దశాబ్దకాలంగా ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోకుండా నిధులు కూడా కేటాయించలేదన్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల అభివృద్ధి, పునరావాసం, భూత్పూర్ డ్యాం విస్తరణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

పాలమూరు శాశ్వత నీటి సమస్య పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే రాజకీయ డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. రైతులు, యువత వాస్తవాలను గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలు మానుకుని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని మాజీ ప్రజాప్రతినిధులకు సూచించారు. “మంచి చేయలేకపోయినా కనీసం చెడు చేయకండి. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది” అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.