డిజిటల్ సంతకాల ప్రక్రియవేగవంతం చేయాలి
- రెవెన్యూ సమీక్షలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఆంధ్రప్రభ బ్యూరో , శ్రీకాకుళం : జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన (రీ-సర్వే), గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియలను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్లు, భూ హక్కులు, సరిహద్దు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన రీ-సర్వేలో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని కలెక్టర్ తెలిపారు . డ్రోన్లు, శాటిలైట్ల ద్వారా సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కొలతలతో పక్కాగా సరిపోల్చి ధృవీకరించాలని ఆదేశించారు. జిల్లాలో రైతులకు అందజేసే పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని, రికార్డుల ధృవీకరణ పూర్తయిన గ్రామాలకు సంబంధించి విడతల వారీగా ముద్రణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజా ఆగస్టు సైకిల్ పరిధిలోకి వచ్చిన వివిధ మండలాల పరిధిలోని గ్రామాలకు సంబంధించి తహసిల్దార్ లాగిన్లలో ఖాతాల పరిశీలన వేగంగా సాగుతోందని కలెక్టర్‌కు వివరించారు. ఈ సైకిల్ పరిధిలో ప్రస్తుతానికి మొత్తం 31,856 ఖాతాలను పరిశీలించగా, అందులో రికార్డులన్నీ పక్కాగా ఉన్న 29,789 ఖాతాలు (93.51 శాతం) పాస్‌బుక్కుల ముద్రణకు సర్వసిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
వీటికి సంబంధించి ఇప్పటికే 30,195 ఖాతాల డిజిటల్ సంతకాల ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయిందని నివేదించారు. మిగిలిన గ్రామాల్లోనూ ఇదే తరహాలో నిరంతరంగా ఈ పరిశీలన సాగుతుందని పేర్కొన్నారు. గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్వాలిటీ చెక్స్ నిర్వహించి, గ్రామ సర్వే బృందాలను రంగంలోకి దించాలని కలెక్టర్ తెలిపారు.
రైతుల నుంచి వచ్చే సరిహద్దు వివాదాలు, ఇతర ఫిర్యాదులను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని, ఎక్కడా పారదర్శకత లోపించరాదని హెచ్చరించారు. రీ-సర్వేలో భాగంగా సాఫ్ట్‌వేర్ చెక్స్ ద్వారా డేటా సరిపోలికను వంద శాతం పక్కాగా అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, రెవెన్యూ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల నుంచి తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
