మైనర్ల చేతుల్లో మద్యం బాటిళ్లు!
- ఒకే భవనంలో రెండు వైన్స్ షాపులు
- రోడ్డే బార్‌గా మారిన గణపురం..
- ప్రమాదాలకు బాధ్యత ఎవరిది?
గణపురం, ఆంధ్రప్రభ : చట్టాలు ఒకవైపు… మద్యం వ్యాపారం మరోవైపు. గణపురం మండల కేంద్ర శివారులో ఒకే భవనంలో భద్రకాళి వైన్స్ , శ్రీ మల్లిఖార్జున వైన్స్ (రెండు వైన్స్) షాపులు నిర్వహిస్తుండటంతో ఆ ప్రాంతం నిత్యం మద్యం ప్రియులతో కిటకిటలాడుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, పాఠశాల యూనిఫామ్‌లతో వచ్చిన మైనర్ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాప్ నిర్వాహకులు మద్యం విక్రయిస్తున్నారు. వైపు పుస్తకాల బ్యాగులు మరోవైపు బీర్లు, క్వార్టర్ బాటిళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకే చోట రెండు షాపులు… రెట్టింపు రద్దీ
ములుగు–పరకాల ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఒకే భవనంలో రెండు వైన్స్ షాపులు నడుస్తుండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు బైకులు, కార్లతో రహదారి పూర్తిగా నిండిపోతోంది. పార్కింగ్ కోసం వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఒక షాపు సరిపోదా… రెండోది ఎందుకు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మైనర్లకు మద్యం… చట్టాలపై బహిరంగ ధిక్కారం
రద్దీని ఆసరాగా చేసుకుని వయసు ధ్రువీకరణ లేకుండానే మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులు స్కూల్ యూనిఫామ్‌లతోనే మద్యం కొనుగోలు చేసి నిర్భయంగా తీసుకెళ్తున్నట్లు ప్రత్యక్షంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
బాధ్యత ఎవరిది..?
మైనర్లకు మద్యం విక్రయించరాదని నిబంధన ఉన్నా ఉద్యమ షాపు నిర్వాహకులదా..? మద్యం షాపుకు విద్యార్థులతో ఉన్న తల్లిదండ్రులుదా..? ప్రమాదాలు జరిగితే బాధ్యత వైన్స్ యజమానులదా? ఒకే చోట రెండు షాపులకు అనుమతులు ఇచ్చిన ఎక్సైజ్ అధికారులదా? లేక నిఘా పెట్టని పోలీసులదా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
