Indrakeeladri | భక్తులందరూ జాగ్రత్త..

  • మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు..
  • అధికారిక ప్రకటనలనే విశ్వసించాలి…
  • అమ్మవారి దర్శనం, సారె సమర్పణ, సేవలు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే చర్యలు…
  • దేవస్థానానికి మధ్యవర్తుల ప్రమేయం లేదు..
  • ఈవో శీనా నాయక్‌
  • వివరాలకు దేవస్థానం వెబ్‌సైట్‌, టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలి..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభలో ప్రచురితమైన ‘పక్కదారి పట్టించే సారె’ కథనంపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం స్పందించింది. భక్తులను ఎవరూ తప్పుదోవ పట్టించకుండా ఇప్పటికే దేవస్థానం తరఫున బహిరంగ ప్రకటన జారీ చేసినట్లు కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్‌ తెలిపారు.

దేవస్థానంలో భక్తులకు అందించే సేవలు, సౌకర్యాలు, ఆర్జిత సేవలు, సారె సమర్పణ తదితర అంశాల్లో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అమ్మవారి దర్శనం చేయిస్తామని, సారె సమర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని, అమ్మవారి సన్నిధిలో సేవ చేసే అవకాశం కల్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా వ్యక్తులు చెప్పే మాటలను భక్తులు నమ్మవద్దని ఈవో శీనా నాయక్ సూచించారు.

దేవస్థానానికి సంబంధించిన ఉచిత సేవలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్జిత సేవలు, దర్శనాలు, ఉత్సవాలు, ఊరేగింపులపై దేవస్థానం అధికారికంగా విడుదల చేసే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు. సోషల్‌ మీడియా లేదా ఇతర ప్రసార మాధ్యమాల్లో వ్యక్తులు చేసే వ్యక్తిగత ప్రకటనలు, ప్రచారాలను నమ్మి భక్తులు మోసపోవద్దని సూచించారు.

దేవస్థానం, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో అవాస్తవ ప్రచారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవస్థానంలో సేవలు పొందడం, విరాళాలు చెల్లించడం, ఉచిత సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం వంటి ఏ అంశంలోనూ మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు.

భక్తులు నేరుగా దేవస్థానం కార్యాలయాన్ని పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ www.kanakadurgamma.org లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 18004259099ను సంప్రదించాలని ఈవో వి.కె. శీనా నాయక్‌ విజ్ఞప్తి చేశారు.