విద్యార్థుల భవిష్యత్తు కోసమే ‘ఛాత్రోన్ కి గూంజ్’ పోరాటం..

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కి గూంజ్’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరాహార దీక్షలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు.

కేంద్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు బాధ్యులైన వారిని పదవుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకులు, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీ పిలుపుతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ‘ఛాత్రోన్ కి గూంజ్’ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, దేశవ్యాప్తంగా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.