నిత్య అన్నదానానికి రూ.15 వేల విరాళం..

సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

భిక్కనూరు, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రమౌళి గుప్త కుటుంబ సభ్యులు ఆలయాన్ని సందర్శించి శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీమాతా భువనేశ్వరీ అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.

ఆషాఢ మాసం శుక్ల చవితి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గుప్త మాట్లాడుతూ, రానున్న శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 17న నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమానికి తమవంతుగా రూ.15 వేల విరాళాన్ని దేవస్థానానికి అందజేసినట్లు తెలిపారు. ఆ రోజు అన్నదానాన్ని తమ కుటుంబ సభ్యుల పేరిట నిర్వహించాలని ఆలయ అధికారులను కోరారు.

దాతృత్వాన్ని చాటుకున్న సంతోష్ కుమార్ గుప్త కుటుంబ సభ్యులను ఆలయ ఆనువంశిక అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ అభినందించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేసి స్వామి, అమ్మవార్ల ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ గుప్త దంపతులు ప్రతిభ, సమర్థ్, సంవృధ్ పూజల్లో పాల్గొన్నారు.