ఇందిరమ్మ ఇళ్ల ఎల్-3 బిల్లుల సమస్యను పరిష్కరించాలి
హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వినతి
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఎల్-3 హౌసింగ్ బిల్లుల విడుదలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎల్-3 హౌసింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హౌసింగ్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్లులను త్వరితగతిన విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
వినతిని స్వీకరించిన హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సమస్యను సానుకూలంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
