నీట్‌లో జైనూర్ విద్యార్థిని సత్తా
- 451 మార్కులతో సుమయ ఫాతిమా ప్రతిభ..
- వైద్య విద్యకు మరో అడుగు
జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని సుమయ ఫాతిమా నీట్–2026 పరీక్షలో 451 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. మారుమూల ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించడంతో స్థానికులు, విద్యావేత్తలు ఆమెను అభినందిస్తున్నారు.
సుమయ ఫాతిమా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు జైనూర్‌లోని కేరళ గ్రామర్ పాఠశాలలో చదివింది. అనంతరం పదో తరగతిని ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్మీడియట్‌ను చైతన్య జూనియర్ కళాశాలలో అభ్యసించింది.
వైద్య విద్య లక్ష్యంగా నీట్–2026 పరీక్షకు హాజరైన ఆమె 451 మార్కులు సాధించింది. ఈ ఫలితంతో వైద్య విద్యలో ప్రవేశానికి మంచి అవకాశాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల మండలమైన జైనూర్ నుంచి నీట్‌లో మంచి మార్కులు సాధించిన సుమయ ఫాతిమాను స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
