సెమీ ఆర్గానిక్ సాగుతో నాణ్యమైన దిగుబడి సాధించాలి..
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : జిల్లాలోని లింగాల ఘనపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ సెమీ ఆర్గానిక్ విధానంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న కూరగాయల తోటను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా తోటలో పండిస్తున్న వివిధ రకాల కూరగాయలను పరిశీలించిన కలెక్టర్, సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్ వినియోగం, నీటి నిర్వహణ, సేంద్రియ ఎరువుల వినియోగం, పురుగు నివారణ చర్యలు, ఉత్పత్తి వ్యయం, దిగుబడి, మార్కెటింగ్ విధానంపై రైతు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.
శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారవంతత పెరగడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు డ్రిప్ ఇరిగేషన్ ఎంతో ఉపయోగకరమని, దీని ద్వారా నీటి వృథాను నివారించడంతో పాటు సాగు ఖర్చులను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
కూరగాయల సాగులో శాస్త్రీయ విధానాలను పాటించాలని, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని మరింత పెంచాలని, మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. ఉత్పత్తుల నాణ్యతను కాపాడుతూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లాలోని ఇతర రైతులు కూడా ఇలాంటి ఆధునిక, నీటి పొదుపు సాగు విధానాలను అవలంబించి అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
