Nagabandham | సనాతన ధర్మ వైభవాన్ని చాటిన ‘నాగబంధం’

‘నాగబంధం’ చిత్రాన్ని వీక్షించిన ఈటల, రామచందర్ రావు
సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే చిత్రం అని ప్రశంసలు
దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ, చిత్ర బృందానికి అభినందనలు

Nagabandham | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ ప్రత్యేక ప్రదర్శనకు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. బీజేపీ నాయకుడు విజిత్ వర్మ ముఖ్య నేతల కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి సినిమా వీక్షించిన ఈటల రాజేందర్, రామచందర్ రావు చిత్ర కథాంశం, నిర్మాణ విలువలను ప్రశంసించారు.

సనాతన ధర్మం, పురాణాల గొప్పతనం, భారతీయ సంస్కృతి–సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాన్ని తెరకెక్కించారని వారు పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలు దేశ సంస్కృతి, విశ్వాసాలు, ఆలయాల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన పెంచుతాయని అన్నారు. దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ, నటీనటులు, చిత్ర బృందం చేసిన ప్రయత్నాన్ని ఈటల రాజేందర్ అభినందించారు. వినోదంతో పాటు సాంస్కృతిక అంశాలను మేళవించి రూపొందించిన చిత్రంగా ‘నాగబంధం’ నిలుస్తుందని పేర్కొన్నారు.

రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. ఇందులో విరాట్ కర్ణతో పాటు నభా నటేష్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పురాణ నేపథ్యం, రహస్య నిధి అన్వేషణ అంశాలతో రూపొందిన ఈ చిత్రం 2026 జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.