ఆషాఢ ఉత్సవాలతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం
- 37,235 మంది భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
- పెద్దఎత్తున ఆషాఢ సారెల సమర్పణ..
- ప్రత్యేక పూజలు, మొక్కల చెల్లింపు..
- దేవాదాయ కమిషనర్, కలెక్టర్ అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ..
- అమ్మవారిని దర్శించుకున్న సినీనటుడు అల్లరి నరేష్
- అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్..
- వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ సారెల సమర్పణకు విశేష స్పందన లభించగా, మహామండపం ఆరవ అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
ఆషాడసారె సమర్పించిన కమిషనర్ కలెక్టర్…

రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ శ దంపతులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేష్ కూడా ఆలయానికి విచ్చేసి కనకదుర్గమ్మను దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
గురువారం నాటి వివరాలు..

దేవస్థానం గణాంకాల ప్రకారం గురువారం మొత్తం 37,235 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 5,566 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. 53,755 ప్రసాదాలను విక్రయించగా, హుండీ ద్వారా రూ.3,47,919 విరాళాలు లభించాయి. 353 మంది సేవల్లో పాల్గొనగా, 1,574 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే 8,551 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
విస్తృత ఏర్పాట్లు…

ఆషాఢ ఉత్సవాల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేశారు.
