వర్షాల కోసం గ్రామదేవతలకు మహిళల ప్రత్యేక పూజలు

నల్లబెల్లి, ఆంధ్రప్రభ: వర్షాకాలం సగానికి చేరుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాట్లు వేసిన పొలాలు ఎండిపోతుండగా, విత్తిన పంటలు మొలక దశలోనే వాడిపోతున్నాయి. దీంతో వానల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నల్లబెల్లి మండలం రాంపూర్ గ్రామ మహిళలు గురువారం గ్రామదేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామదేవతలైన బొడ్రాయి, పోచమ్మ, ఎర్రమ్మ తల్లి ఆలయాలతో పాటు హనుమాన్ ఆలయంలో మంచినీటితో అభిషేకాలు చేసి, వరుణదేవుడు సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించారు.

అనంతరం మహిళలు భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కూడా పాల్గొని వర్షాలు కురవాలని ప్రార్థించారు.

ప్రస్తుతం వర్షాభావంతో వరి నారుమళ్లు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుబడులు తగ్గడంతో పాటు భారీ ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ శ్రేయస్సు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలు స్వచ్ఛందంగా నిర్వహించిన ఈ సామూహిక పూజలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, సామాజిక బాధ్యతను చాటిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.