చివరకు చిక్కిన గజరాజు..
- నెల రోజుల హైటెక్ ఆపరేషన్ సక్సెస్!
- డ్రోన్లు, థర్మల్ కెమెరాలతో ట్రాక్ చేసి పట్టివేత..
- అటవీ సిబ్బందిని అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పలమనేరు, ఆంధ్రప్రభ: చిత్తూరు జిల్లా పలమనేరు పరిసర ప్రాంతాల్లో పంటలను ధ్వంసం చేస్తూ, గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. సుమారు నెల రోజుల పాటు సాగిన ప్రత్యేక ఆపరేషన్‌లో అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సార్ కెమెరాల సహాయంతో ఏనుగు కదలికలను నిరంతరం పర్యవేక్షించి చివరకు పట్టుకున్నారు.
సుమారు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల ఈ అడవి ఏనుగును వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పశువైద్య నిపుణులు, అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో బంధించారు. తుది ఆపరేషన్‌లో ముసలమడుగు కుంకీ శిబిరం నుంచి తీసుకొచ్చిన ఐదు కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషించాయి.
పవన్ కల్యాణ్ అభినందన
గతంలో ఇదే ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన పలమనేరు అటవీ విభాగం సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ కోలుకున్న అనంతరం ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం విశేషం. ఆయన ధైర్యసాహసాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్ యశోదా బాయి, చిత్తూరు జిల్లా అటవీ అధికారులు, పశువైద్య నిపుణులు, ట్రాకర్లు, మహౌత్‌లు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బందిని పవన్ కల్యాణ్ అభినందించారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పలుమార్లు జనావాసాల్లోకి వచ్చి పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఈ ఏనుగును బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. డ్రోన్లు, థర్మల్ సెన్సార్ కెమెరాలతో నెల రోజుల పాటు కదలికలను గుర్తిస్తూ చివరకు గతంలో దాడి జరిగిన ప్రాంతానికే సమీపంలోని జాతీయ రహదారి వద్ద విజయవంతంగా పట్టుకుంది.
బంధించిన ఏనుగును ముసలమడుగు కుంకీ శిబిరానికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు, ప్రవర్తన పరిశీలన అనంతరం అవసరమైతే ప్రత్యేక శిక్షణ ఇచ్చి కుంకీ ఏనుగుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులకు సూచించారు.

