కార్డిఫ్‌లో భారత్‌దే పైచేయి!

  • 4 వన్డేల్లో 3 విజయాలు.. 75 శాతం సక్సెస్ రేట్
  • రెండో వన్డే గెలిస్తే సిరీస్ భారత్ సొంతం
  • కోహ్లీకి మరో రికార్డు..

ఆంధ్రప్రభ : ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఘనంగా గెలిచిన టీమిండియా.. గురువారం కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగే రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన.. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కార్డిఫ్ వేదికపై భారత్‌కు ఉన్న అద్భుతమైన రికార్డు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

కార్డిఫ్‌లో భారత్‌కు 75 శాతం విజయాలు….

సోఫియా గార్డెన్స్‌లో భారత్ ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడగా.. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. అంటే ఈ మైదానంలో టీమిండియా విజయశాతం 75 శాతం. మొత్తం అన్ని ఫార్మాట్లు కలిపి ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత్ మూడు విజయాలు, రెండు పరాజయాలు నమోదు చేసింది.

కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ రెండు వన్డేలు ఆడింది. 2011లో ఆరు వికెట్ల తేడాతో ఓడిన భారత్.. 2014లో మాత్రం 133 పరుగుల భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఈ వేదికపై ఇరు జట్ల మధ్య వన్డే రికార్డు 1-1తో సమంగా ఉంది.

2014లో రైనా మెరుపులు.. జడేజా మాయాజాలం

ఈ మైదానంలో ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన ఏకైక వన్డే విజయంలో సురేశ్ రైనా కీలక పాత్ర పోషించాడు. 75 బంతుల్లో శతకం బాది భారత్‌ను 304 పరుగులకు చేర్చాడు. అనంతరం రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్‌ను 161 పరుగులకే కుప్పకూల్చి భారత్‌కు ఘన విజయం అందించాడు.

కోహ్లీకి మరో రికార్డు అవకాశం

సోఫియా గార్డెన్స్‌లో భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను ఇక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. వన్డేల్లో మాత్రం 196 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్‌పై కార్డిఫ్‌లో అత్యధిక పరుగుల రికార్డు ప్రస్తుతం సురేశ్ రైనా (115) పేరిట ఉంది. కోహ్లీ మరో 9 పరుగులు చేస్తే ఆ రికార్డును అధిగమిస్తాడు.