భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం..

ఉట్నూర్ (ఆంధ్రప్రభ): తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భూ భారతి రీ-సర్వే ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హీరాపూర్ గ్రామంలో గురువారం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూ భారతి రీ-సర్వే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికత, డ్రోన్లు, రోవర్లు, జీపీఎస్ సహాయంతో భూముల సరిహద్దులను శాస్త్రీయంగా కొలిచి, ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు.

భూ సర్వే కోసం గ్రామాలకు వచ్చే అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించి రీ-సర్వేను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాగే ఎస్‌ఐఆర్ సర్వేలో ఎన్యూమరేషన్ ఫారాలను వంద శాతం సమర్పించి అధికారులకు సహకరించిన హీరాపూర్ గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్, తహసీల్దార్ కోట్నక్ రఘునాథరావు, స్థానిక సర్పంచ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.