రాష్ట్రానికి సిరిసంపదల నిలయం..

  • నవ్యాంధ్ర అభివృద్ధికి కర్నూలే కేంద్రబిందువు
  • సహజ వనరులు, పారిశ్రామిక అవకాశాలతో కర్నూలుకు ఉజ్వల భవిష్యత్
  • కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : సహజ వనరులు, విస్తారమైన భూభాగం, జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం, పారిశ్రామిక అవకాశాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వంటి అనేక ప్రత్యేకతలతో కర్నూలు జిల్లా నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా అవతరించబోతోందని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామికాభివృద్ధి విధానాలతో కర్నూలు పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారుతోందని ఆయన తెలిపారు.

కర్నూలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి, జాతీయ రహదారి 44, ఎన్‌హెచ్–167, జాతీయ రహదారి 40, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయం వంటి సౌకర్యాలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని వివరించారు.

కర్నూలు జిల్లా ఖనిజ సంపదకు నిలయమని పేర్కొంటూ, సున్నపురాయి, బారైట్స్, ఇనుప ఖనిజం, గ్రానైట్‌తో పాటు బంగారం వంటి విలువైన ఖనిజాలు జిల్లాలో సమృద్ధిగా లభిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభమవడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.

పునరుత్పాదక ఇంధన రంగంలోనూ కర్నూలు ముందంజలో ఉందని, భారీ సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు జిల్లాలో ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఆర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్, డ్రోన్ సిటీ, వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధితో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.

2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని, అదే సమయంలో కర్నూలు జిల్లాకు సాగు, పరిశ్రమలు, తాగునీటి రంగాల్లో మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. కర్నూలును దక్షిణ భారత పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని, పారిశ్రామికవేత్తలు కర్నూలులో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.