అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులపై జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక డ్రైవ్
హనుమకొండ (ఆంధ్రప్రభ): గ్రేటర్ వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో గురువారం నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, డీఆర్ఎఫ్ బృందాలు ఏసీపీల నేతృత్వంలో అంబేద్కర్ సర్కిల్, మిషన్ హాస్పిటల్, సర్క్యూట్ హౌస్ తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులు, ప్రచార బోర్డులను తొలగించాయి. ఈ సందర్భంగా కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ, మొదటి విడతలో వారం రోజుల్లో నగరంలోని అన్ని అనధికార ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను తొలగిస్తామని తెలిపారు.
రెండో విడతలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల గోడలపై ఉన్న అనధికార వాల్ రైటింగ్స్, పోస్టర్లు, పెయింటింగ్‌లను తొలగించి, వాటి స్థానంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే వాల్ పెయింటింగ్‌లు రూపొందిస్తామని చెప్పారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నగరంలోని అన్ని అనధికార ప్రచార సామగ్రిని పూర్తిగా తొలగించనున్నట్లు వెల్లడించారు.
మున్సిపల్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులు ఏర్పాటు చేసిన వారిపై భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. స్వచ్ఛమైన, సుందరమైన, క్రమబద్ధమైన గ్రేటర్ వరంగల్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
