ఆనవాళ్లు కోల్పోతున్న.. జెడ్పీ గెస్ట్ హౌజ్..!
- అధికారుల అనాలోచిత చర్యతో అన్యాక్రాంతం
- ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఇక జెడ్పీ గెస్ట్ హౌజ్ లేనట్టే
- తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రజా ప్రతినిధులు
ఖమ్మం ఉమ్మడి బ్యూరో-ఆంధ్రప్రభ : జిల్లాకు అడపాదడపా వచ్చే అతిధులు, ఉన్నత స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లు, జెడ్పీటీసీ సభ్యులు, పలు హోదాలు కల్గిన ఇతరులకు విశ్రాంతి ఇచ్చేందుకు 20 సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెడ్పీ గెస్ట్‌హౌజ్ ప్రస్తుతం ఆనవాళ్లను కోల్పోతోంది.
జిల్లాలో కొందరు అధికారుల అనాలోచిన చర్య కారణంగా భవిష్యత్‌లో గెస్ట్ హౌజ్ కనుమరుగు కానుంది. మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్గీయ గోనెల విజయలక్ష్మి కాలంలో అతిధుల కోసం ఈ గెస్ట్ హౌజ్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. అతిధులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో జెడ్పీ మీటింగ్ హాల్‌లో జరిగే ఎంపీడీఓలు, తాహశీల్దార్‌లు, వీఆర్‌ఓలు, వీఏఓలు, ఇతర జిల్లా స్థాయి సమావేశాలు ఏవి జరిగినా.. గెస్ట్ హౌజ్ ప్రాంగణంలోనే అధికారికంగా భోజనాలు ఏర్పాటు చేసేవారు.
ఏ సమావేశాలు జరిగినా జెడ్పీ మీటింగ్ హాల్‌కు, జిల్లా పరిషత్ కార్యాలయానికి అనుబంధంగా గెస్ట్ హౌజ్ కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే జెడ్పీ మీటింగ్ హాల్‌కు కాని, జిల్లాకు వచ్చే అతిధులకు కాని ఇది సౌకర్యవంతమైన ప్రాంగణం. అటువంటి ప్రాంగణాన్ని జిల్లా అధికారులు ఇటీవల ఒక హాస్టల్‌కు కేటాయించడం తీవ్ర ఆరోపణలు, విమర్శలకు దారితీసింది.
ఒక శాఖకు ఆ గెస్ట్ హౌజ్‌ను కేటాయించడంతో సంబంధిత శాఖ అధికారులు అతిధులు, జిల్లా అవసరాల కోసం నిర్మించిన గెస్ట్ హౌజ్ భవనంలో కట్టడాలు కూల్చి హాస్టల్ బెడ్‌లకు అనుకూలంగా నిర్మాణాలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గెస్ట్ హౌజ్ గోడలు కూల్చే పనులు ప్రారంభించారు.
గెస్ట్ హౌజ్‌లో మరిన్ని వసతులు కల్పించి అతిధులు, జిల్లా అవసరాల కోసం ఉపయోగించాల్సిన అధికారులు, జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మరింత గా ఉపయోగపడేట్లు చేయాల్సిన అధికారులు అది మర్చిపోయి ఉన్న భవనాన్ని తమకున్న అధికారంతో ఇతరులకు కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
జిల్లా పరిషత్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన భవనం ఆ భవనం స్థానిక సంస్థల ప్రతినిధుల అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం జెడ్పీ పాలకవర్గం లేకపోవడం, జెడ్పీటీసీ సభ్యులు లేకపోవడంతో అధికారులు తప్పుడు నిర్ణయం తీసుకుని తప్పిదానికి పాల్పడ్డారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పాలకవర్గాలు, ప్రజా ప్రతినిధులు వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జిల్లాలో ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు తప్పుబడుతున్నారు.
వెంటనే అధికారులు చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని, జెడ్పీ గెస్ట్ హౌజ్‌ను గౌరవంగా, మరింత ఉన్నతంగా కొనసాగించే ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయాలు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుండి వినిపిస్తున్నాయి. ఆ మేరకు జిల్లా పరిషత్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

