న్యాయవాదుల ఆరోగ్య రక్షణకు సుజనా ఫౌండేషన్ సేవలు అభినందనీయం
- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రశంసించిన సీపీఐ నేత నారాయణ, సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్
- 211 మంది న్యాయవాదులకు వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
విజయవాడ, ఆంధ్రప్రభ : న్యాయవాదుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని సీపీఐ నేత నారాయణ, సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ అన్నారు.
బుధవారం విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. న్యాయవాదుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమన్నారు. నిత్యం వృత్తిపరమైన ఒత్తిడిలో ఉండే న్యాయవాదుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారిలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడిందన్నారు. సుజనా ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ అందిస్తున్న వైద్య సేవలను ఆయన ప్రశంసించారు.
బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించి సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వైద్య శిబిరంలో 211 మంది న్యాయవాదులకు నిపుణులైన వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్రే, రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఆంధ్రా హాస్పిటల్స్ వైద్యులు శిబిరంలో సేవలందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వి. కిరణ్ కుమార్, పీఎస్ఆర్ ప్రసాద్ బాబు, బి. లెనిన్, శ్రీకాంత్, నరహరిశెట్టి జ్యోతి, సరస్వతి, కొల్లా జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
