థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

  • ప్రతి పది మందిలో ఒకరికి హైపోథైరాయిడిజం
  • మహిళల్లోనే సమస్య ఎక్కువ.. వైద్య పరీక్షలు కీలకం
  • ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం

విజయవాడ, ఆంధ్రప్రభ : హైపోథైరాయిడిజం సమస్యను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం సూచించారు. భారతదేశంలో ప్రతి పది మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. సాధారణ రక్త పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి, వైద్యుల సూచన మేరకు సరైన చికిత్స తీసుకుంటే అదుపులో ఉంచవచ్చని చెప్పారు.

వాసవ్య నర్సింగ్ హోంలో డి. రవికుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో ‘హైపోథైరాయిడిజం’ అంశంపై డాక్టర్ సమరం ప్రసంగించారు. మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే టీ4, టీ3 హార్మోన్లు శరీర జీవక్రియలు, గుండె పనితీరు, మెదడు, కండరాల పనితీరు, శరీర ఉష్ణోగ్రత, శక్తి వినియోగాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడాన్నే హైపోథైరాయిడిజం అంటారని తెలిపారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం

అలసట, నిద్రమత్తు, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం, మలబద్ధకం, ముఖం, కాళ్లు ఉబ్బడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, గొంతు బొంగురుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, మానసిక కుంగుబాటు, మహిళల్లో నెలసరి అవకతవకలు, గర్భం ధరించడంలో ఇబ్బందులు, పురుషుల్లో లైంగిక ఆసక్తి తగ్గడం కూడా ఈ సమస్య లక్షణాలుగా ఉండవచ్చని చెప్పారు.

ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అయోడిన్ లోపం లేదా అధిక వినియోగం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియో అయోడిన్ చికిత్స, కొన్ని మందుల దుష్ప్రభావాలు, పుట్టుకతో వచ్చే థైరాయిడ్ లోపం, కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉండటం వంటి కారణాలతో హైపోథైరాయిడిజం వచ్చే అవకాశముందని వివరించారు.

గర్భిణులు మరింత జాగ్రత్త

టీఎస్‌హెచ్, ఫ్రీ టీ4తో పాటు అవసరాన్ని బట్టి ఇతర థైరాయిడ్ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చని డాక్టర్ సమరం తెలిపారు. ముఖ్యంగా గర్భిణుల్లో థైరాయిడ్ హార్మోన్ లోపం తల్లి ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అందువల్ల వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు.

హైపోథైరాయిడిజం ఉన్నవారు వైద్యులు సూచించిన మోతాదులో లివోథైరాక్సిన్ మాత్రను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలన్నారు. వైద్యుల సలహా లేకుండా మందులు ఆపడం లేదా మోతాదును మార్చడం చేయకూడదని హెచ్చరించారు. చాలా మందికి దీర్ఘకాలం చికిత్స అవసరమవుతుందని పేర్కొన్నారు.

సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, అవసరమైన వారు అయోడిన్ కలిగిన ఉప్పు వినియోగించడం వంటి జీవనశైలి మార్పులు కూడా వ్యాధి నియంత్రణలో కీలకమని తెలిపారు. మహిళలు, గర్భిణులు, కుటుంబంలో థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వారి ప్రశ్నలకు డాక్టర్ సమరం సమాధానాలు ఇచ్చి సందేహాలను నివృత్తి చేశారు.