నారా లోకేష్ విజన్‌తో ఏపీకి పారిశ్రామిక పునర్వైభవం..
నారా లోకేష్ విజన్‌తో ఏపీకి పారిశ్రామిక పునర్వైభవం..
లోకేష్ చొరవతో ప్రపంచ దిగ్గజాల చూపు ఏపీ వైపు
రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకకు కారణం పెట్టుబడిదారులకు కల్పించిన విశ్వాస వాతావరణం
యువతకు ఉద్యోగాలు… రాష్ట్రానికి పెట్టుబడులు… లోకేష్ నాయకత్వంలో ఏపీకి కొత్త దిశ..
ఎంపీ కేశినేని చిన్ని
భవానిపురం లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ను సందర్శించిన ఎంపీ చిన్ని
భవానీపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో గల రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్ ఎండీ తేజ ఎంపీకి ఘన స్వాగతం పలికి, సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వివరించారు. షోరూమ్‌లోని అత్యాధునిక సదుపాయాలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలను ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించి అభినందించారు. అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడం రాష్ట్రంలో నెలకొన్న సానుకూల పారిశ్రామిక వాతావరణానికి నిదర్శనమన్నారు.

ఈ విశ్వాసాన్ని నెలకొల్పడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన లోకేష్, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పరిపాలన, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దారని అన్నారు. గతంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాల వైపు వెళ్లిన పరిస్థితుల నుంచి నేడు ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ను ఆశాజనక పెట్టుబడి కేంద్రంగా గుర్తించడం రాష్ట్రానికి గర్వకారణమని ఎంపీ తెలిపారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థల రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏపీలోకి రావడం కేవలం ఒక సంస్థ రాక మాత్రమే కాదనీ,అది నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌పై పెరుగుతున్న పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రతీక అని మంత్రి లోకేష్ కృషిని కొనియాడారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయనీ, ఉద్యోగాలు వస్తే యువత భవిష్యత్తు బలపడుతుందని రాష్ట్ర అభివృద్ధికి ఇది శుభసూచకం అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. రాయల్ ఎంఫిల్డ్ షోరూమ్ సిబ్బంది తో ఎంపీ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అనంతరం సిబ్బంది తో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో షోరూమ్ ప్రతినిధులు, వ్యాపార వర్గాల ప్రముఖులు, పార్టీ నాయకులు పరుచూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
