చనిపోయాక ఆ గౌరవం నాకొద్దు.. ముందే లేఖ రాసిన ముద్రగడ!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి. అయితే తన మరణం తర్వాత అంత్యక్రియలు ఎలా జరగాలి..? కుటుంబ సభ్యులు ఏం చేయాలి..? తనకు ఎలాంటి గౌరవాలు వద్దు..? అనే విషయాలపై ముద్రగడ ముందుగానే రాసి ఉంచినట్లు చెబుతున్న లేఖ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆ లేఖలో ఆయన పేర్కొన్న చివరి కోరికలు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారాయి.

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముందుగానే రాసిన లేఖలోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. తన చివరి ప్రయాణం విషయంలోనూ ముద్రగడ తనదైన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

‘అధికారిక లాంఛనాలు నాకు వద్దు’

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాను మరణిస్తే తన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించవద్దని ముద్రగడ తన లేఖలో స్పష్టంగా రాశారు. పోలీసుల గౌరవ వందనం కూడా తనకు అవసరం లేదని పేర్కొన్నారు. జీవించి ఉన్న సమయంలో ఇబ్బందులు పెట్టి.. మరణించిన తర్వాత ఇచ్చే గౌరవం, గుర్తింపు తనకు అవసరం లేదని లేఖలో తన మనసులోని మాటను వెల్లడించారు. మరోవైపు ముద్రగడ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా నిర్ణయించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

దహనం వద్దు.. ఖననం చేయండి

తన అంత్యక్రియల విధానంపైనా ముద్రగడ స్పష్టమైన సూచనలు చేశారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించకుండా తనను ఖననం చేయాలని కోరారు. ఇంటి ఆవరణలో తనను ఎక్కడ ఖననం చేయాలో కూడా లేఖలో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలోనే ఖననం చేస్తే తాను ఎప్పటికీ తన కుటుంబంతోనే ఉన్నాననే భావన ఉంటుందని ముద్రగడ రాశారు. తన చివరి విశ్రాంతి స్థలం కూడా కుటుంబానికి దగ్గరగానే ఉండాలన్న కోరికను లేఖలో వ్యక్తం చేశారు.

‘నా భార్య బొట్టు, గాజులు తీయొద్దు’

తన భార్య విషయంలోనూ ముద్రగడ భావోద్వేగంతో ఓ కోరికను కుటుంబ సభ్యుల ముందు ఉంచారు. తన మరణం తర్వాత భార్య బొట్టు, గాజులు తొలగించవద్దని స్పష్టంగా రాశారు. ఆమెను పుణ్యస్త్రీగానే కొనసాగించాలని కోరారు. తాను లేకపోయినా భార్య విషయంలో సంప్రదాయం పేరుతో బొట్టు, గాజులు తొలగించవద్దన్నది తన కోరికగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు.