రేపే జగన్నాథుడి రథయాత్ర.. పూరీకి పోటెత్తిన భక్తజనం

  • రథమెక్కనున్న జగన్నాథుడు.. పూరీకి పోటెత్తిన భక్తకోటి
  • కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రం
  • రథయాత్ర వేళ పూరీకి రెడ్ అలర్ట్..
  • అప్రమత్తమైన అధికారులు

ఆంధ్రప్రభ : భక్తకోటి ఎదురుచూస్తున్న మహాఘట్టానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచ ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి రథయాత్ర గురువారం అంగరంగ వైభవంగా జరగనుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్న అపూర్వ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇప్పటికే పూరీకి చేరుకుంటున్నారు. అయితే, ఓవైపు భారీ వర్షం దంచికొడుతున్నా.. భక్తుల రాక మాత్రం ఆగడం లేదు. దీంతో పుణ్యక్షేత్రం జగన్నామస్మరణతో మార్మోగుతోంది.

రథయాత్రకు ఒక్కరోజు ముందు పూరీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పూరీలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం దంచికొట్టింది. ఈ నేపథ్యంలో పూరీ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల నిరీక్షణ

ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలయం నుంచి బయలుదేరే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి భారీ రథాలపై భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి రథాలను లాగే మహద్భాగ్యం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షిస్తే జన్మ ధన్యమవుతుందనే విశ్వాసంతో లక్షలాది మంది పూరీకి తరలివస్తారు.

దీంతో ఈసారి కూడా రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పూరీ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వర్షంలో తడుస్తూనే భక్తులు జగన్నాథుడిని స్మరిస్తూ రథయాత్ర మహోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు.

పూరీలో కుండపోత.. 24 గంటల్లో 143.8 మిల్లీమీటర్ల వర్షం

బుధవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో పూరీ పట్టణంలో ఏకంగా 143.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగన్నాథుడి రథాలు కదిలే ప్రధాన మార్గంలోనూ వర్షపు నీరు నిలిచింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రత్యేక పంపుల సాయంతో రథయాత్ర మార్గంలో నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుగానే పంపులను సిద్ధంగా ఉంచారు. రథయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

రథయాత్ర వేళ రెడ్ అలర్ట్.. అధికారుల అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పూరీతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పూరీ పట్టణానికి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువసేపు వర్షంలో ఉండొద్దని కోరారు.

భారీ వర్షం, పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక నిర్మాణాల కింద తలదాచుకోవద్దని అధికారులు హెచ్చరించారు. సురక్షితమైన శాశ్వత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో భక్తులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

వర్షం దంచికొడుతున్నా.. జగన్నామమే!

ఓవైపు ఆకాశం నుంచి కుండపోత.. మరోవైపు పూరీ వీధుల్లో భక్తజనం. వర్షం ఎంతగా దంచికొడుతున్నా జగన్నాథుడి దర్శనం కోసం వచ్చిన భక్తుల ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. రథయాత్ర మహాఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు పూరీలోనే నిరీక్షిస్తున్నారు. రథాలు కదిలే ఆ అపూర్వ క్షణం కోసం భక్తకోటి ఎదురుచూస్తోంది. వాన కురిసినా.. వరదలా భక్తులు తరలివచ్చినా.. పూరీలో ఇప్పుడు వినిపిస్తున్నది ఒక్కటే నామం.. ‘జై జగన్నాథ్’!

జూలై 17 వరకు మత్స్యకారులకు హెచ్చరిక

అల్పపీడనం ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై 17 వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.