Narendra Modi | మోదీ పిలుపు వెనుక అసలు మర్మం ఏమిటి?

Narendra Modi | మోదీ పిలుపు వెనుక అసలు మర్మం ఏమిటి?
ఇంధన పొదుపు వెనుక ఆర్థిక వ్యూహం
బంగారం కొనుగోళ్లపై ఆందోళన,ప్రభావం
వర్క్ ఫ్రమ్ హోమ్ – కొత్త జీవనశైలి మార్పు
సంక్షోభ సూచనా? లేక ముందస్తు సిద్ధతా?
Narendra Modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; “పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపండి.. బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండండి..” – ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇలాంటి విజ్ఞప్తి చేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటి? భారత్ ఏదైనా ఆర్థిక సంక్షోభానికి సిద్ధమవుతోందా? లేక దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా ఇది ఒక మాస్టర్ ప్లానా?
ఇంధన పొదుపు – రూపాయి విలువను కాపాడటమే లక్ష్యమా?

భారతదేశం తన అవసరాలకు కావాల్సిన చమురులో దాదాపు 80% పైగా దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం వేల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం వెచ్చించాల్సి వస్తోంది. చమురు దిగుమతులు పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
అందుకే ఇంధన పొదుపు చేయడం ద్వారా చమురు దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు రూపాయి విలువను కాపాడటానికి సహాయపడుతుంది. అయితే మోదీ పిలుపుతో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు తమ అధికారిక వాహనాలను పక్కన పెట్టి, ఇంధన పొదుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇంధన వాడకం తగ్గించడం ద్వారా విదేశీ వాణిజ్య లోటును తగ్గించి, రూపాయిని బలోపేతం చేయడమే మోదీ అసలు వ్యూహమా?.
బంగారంపై మోజు తగ్గాలి..

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ప్రపంచ ప్రసిద్ధి. అయితే, చమురు తర్వాత భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకునేది బంగారాన్నే. మోదీ ప్రకటన వెలువడినప్పటి నుండి మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిమాండ్ పెరుగుతుందన్న భయంతోనో లేక మున్ముందు దిగుమతి సుంకాలు పెరుగుతాయన్న సంకేతంతోనో ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త జీవనశైలికి పునాదా?

కరోనా కాలంలో అనివార్యమైన వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు ఇంధన పొదుపుకు ఒక అస్త్రంగా మారింది. ట్రాఫిక్ కాలుష్యం తగ్గడమే కాకుండా, కార్యాలయాల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే, ఐటీ రంగం మళ్ళీ ఆఫీసులకు రావాలని కోరుతున్న తరుణంలో మోదీ ఇలా అనడం ఆసక్తికరంగా మారింది.
సంక్షోభమా?… సిద్ధపాటా?
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులుమారుతున్నాయి. ముడి చమురు సరఫరాలో ఆటంకాలు కలిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారమా? అందుకే మోదీ ముందుగానే దేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు కేవలం ఒక సలహా మాత్రమేనా లేక రాబోయే కాలంలో రానున్న భారీ మార్పులకు ఇవి సంకేతాలా? దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చే క్రమంలో ప్రజలు చేసే ఈ చిన్న త్యాగాలు ఫలిస్తాయా? లేక సామాన్యుడిపై ఇది మరింత భారం మోపుతుందా? అని చూడాలి.
CLICK HERE TO READ Algae tree | కాలుష్యానికి చెక్ పెట్టే ఆల్గే ట్రీ
