RS Praveen Kumar | సీఎం రేవంత్‌కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేఖ..
గురుకులాల నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
సమగ్ర దర్యాప్తుతో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అక్రమాలపై నిజానిజాలు వెలికితీయాలని విజ్ఞప్తి
RS Praveen Kumar | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తూ, మాజీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై సమగ్ర విచారణ చేపట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పనిచేసిన 2013 నుంచి 2021 మధ్య కాలంలో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు జరిగాయని గువ్వల బాలరాజు ఆరోపించారు. సుమారు రూ.10 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, టెండర్ ప్రక్రియ పాటించకుండా నిధులు ఖర్చు చేశారని లేఖలో పేర్కొన్నారు.
అదేవిధంగా నియామకాలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణలో అక్రమాలు జరిగాయని, ఐఐటీ, జేఈఈ కోచింగ్ పేరుతో నిధులను దుర్వినియోగం చేశారని కూడా ఆరోపించారు. ఈ వ్యవహారాలపై స్వతంత్రంగా సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు రుజువైతే సంబంధిత ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతుతోనే ఈ అక్రమాలు జరిగాయని గువ్వల బాలరాజు ఆరోపించారు. అలాగే, గురుకుల విద్యాలయాల కార్యదర్శి వంటి ఐఏఎస్ క్యాడర్ బాధ్యతలను ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు దాదాపు పదేళ్లపాటు అప్పగించడం వెనుక కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గువ్వల బాలరాజు తన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు.
