Revanth Delhi Tour | హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరిన సీఎం

గడ్కరీ, రామ్మోహన్ నాయుడితో రాష్ట్ర కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చలు
ఆర్‌ఆర్‌ఆర్‌, మెట్రో ఫేజ్-2, వరంగల్-ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర సహకారం కోరిన సీఎం

Revanth Delhi Tour | హైదరాబాద్ వెబ్‌డెస్క్ : ఢిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం మంజూరు చేయాలని, దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని కోరారు.

అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన సీఎం, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తైన నేపథ్యంలో నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2) విస్తరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.