విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
- కేజీబీవీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
- ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌పై అధికారులకు ఆదేశాలు
- విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్..
- ఆస్పత్రి సేవలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమీక్ష
కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం కడెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, ఎన్నికల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా కడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని తనిఖీ చేసిన కలెక్టర్, పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై క్విజ్ నిర్వహించి, సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందజేసి అభినందించారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి సూచించారు.

అనంతరం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ప్రతిరోజూ అందుబాటులో ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తర్వాత ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా డీఈవో భోజన్న, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో అరుణ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కే. శివకుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్, కేజీబీవీ ప్రత్యేక అధికారి కే. విమలతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
