జిల్లాలో 10,055 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు
ఎరువుల కొరత లేదు..
అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు: కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసే రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలను ముందుగానే సిద్ధం చేసినట్లు చెప్పారు.
జిల్లాకు ఖరీఫ్ సీజన్‌లో 17,392 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 3,322 మెట్రిక్ టన్నులు విక్రయించామని, ప్రస్తుతం 10,055 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. అలాగే 1,530 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరానికి ఇప్పటివరకు 978 మెట్రిక్ టన్నులు విక్రయించగా, 2,722 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయని తెలిపారు.
కాంప్లెక్స్ ఎరువుల అవసరం 16,121 మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 2,792 మెట్రిక్ టన్నులు విక్రయించామని, ప్రస్తుతం 16,163 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. ఇతర ఎరువుల అవసరం 8,626 మెట్రిక్ టన్నులు ఉండగా, 896 మెట్రిక్ టన్నులు విక్రయించామని, మరో 2,302 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఎరువుల సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసిన కలెక్టర్, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు 20 మంది హోల్‌సేల్, రిటైల్ ఎరువుల డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు విక్రయించడం, అక్రమాలకు పాల్పడిన టాప్-20 డీలర్లపై కూడా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు చెప్పారు.
క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, సరిహద్దు గ్రామాల్లో కూడా పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో పంట సాగు చేసిన రైతుల వివరాలన్నీ యాప్‌లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలు నమోదు కాని రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులు కూడా తమ సాగు వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
ప్రస్తుతం జిల్లాలో 27,292 మంది రైతులకు 74,817 యూరియా బస్తాలు, 6,978 డీఏపీ బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్. వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
