సింగరేణి పరిరక్షణే లక్ష్యం.. రాజకీయాల కోసం రాలేదు

  • భూపాలపల్లి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శల వర్షం
  • రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయం

గణపురం, ఆంధ్రప్రభ : రాజకీయాల కోసం కాదు.. సింగరేణి పరిరక్షణ కోసమే భూపాలపల్లికి వచ్చాం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం కేటికే 8 ఇంక్లైన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు బిజెపి అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ భవిష్యత్తు, కార్మికుల సంక్షేమం, బొగ్గు ఉత్పత్తిపై కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యత క్రమంగా తగ్గుతుండటం ఆందోళనకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన బొగ్గు అందుబాటులో లేకపోవడంతో పలు కంపెనీలు ఇతర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

సింగరేణిపై వేల కోట్ల రూపాయల అప్పు మోపారని ఆరోపించిన ఆయన, గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులను అదే ప్రాంతాల్లో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్ కోసం సింగరేణి నిధులను వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు.

తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థను పరిరక్షించడంతో పాటు కార్మికుల హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పాయల శంకర్, రాకేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి, ఎరుకల గణపతి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిశిదర్ రెడ్డి, నారాయణ రెడ్డి , ఊర నవీన్ రావు , బీఎంఎస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.