ఏఐతో బోధనకు కొత్త దిశ..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతకు నూతన అధ్యాయం

గణపురం, ఆంధ్రప్రభ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత బోధనా విధానాలను పాఠశాలల్లో సమర్థవంతంగా వినియోగిస్తే విద్యార్థుల్లో అభ్యాస నైపుణ్యాలు పెరగడంతో పాటు బోధన మరింత ప్రభావవంతంగా మారుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.

గణపురం మండలంలో ఉపాధ్యాయులకు నిర్వహించిన ఏఐ ఆధారిత బోధనా శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా క్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించవచ్చని తెలిపారు.

ఏఐ టూల్స్ సహాయంతో ఆకర్షణీయమైన ప్రజెంటేషన్లు, బోధనా సామగ్రి, ప్రశ్నాపత్రాలు, వర్క్‌షీట్లు, మూల్యాంకన పత్రాలను తక్కువ సమయంలో సిద్ధం చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయుల పనిభారం తగ్గడమే కాకుండా బోధనలో నాణ్యత కూడా పెరుగుతుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని కొత్త అంశాలను విద్యార్థులు సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ఏఐ కల్పిస్తుందని ఆయన వివరించారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత మరింత మెరుగుపడి, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు. తద్వారా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఏఎంఓ విజయపాల్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు మధు, అనిల్ కుమార్, రఘునాథరెడ్డి, రాజబాబు, అలాగే కాటారం, మహముత్తారం, భూపాలపల్లి, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.