కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రెండు కీలక వినతిపత్రాలు అందజేత..

మల్హర్‌రావు, ఆంధ్రప్రభ : సింగరేణి భరోసా యాత్రలో భాగంగా తాడిచెర్ల గ్రామానికి వచ్చిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి తాడిచెర్ల–కాపురం గ్రామాల జెన్‌కో భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి రెండు కీలక వినతిపత్రాలను అందజేశారు. తాడిచెర్ల నుంచి శాత్‌రాజ్‌పల్లి వరకు విస్తరించిన సింగరేణి కోల్‌బ్లాక్–2 ప్రాజెక్టును సింగరేణికి అప్పగించిన నేపథ్యంలో తాడిచెర్లలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఈ వినతిపత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా కేసరపు రవి మాట్లాడుతూ, తాడిచెర్ల డేంజర్‌ జోన్‌లోని ఇళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తెలంగాణ జెన్‌కో ఈ ఏడాది మే 26న జిల్లా కలెక్టర్ ఖాతాలో నిధులు జమ చేసినప్పటికీ, దాదాపు రెండు నెలలు గడిచినా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, నిర్వాసితులను తరలించే ప్రక్రియను ప్రారంభించలేదని ఆరోపించారు.

డేంజర్‌ జోన్‌లో ప్రజలు నిత్యం ప్రాణభయంతో జీవిస్తున్నారని పేర్కొంటూ, కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి వెంటనే సర్వే చేపట్టి పునరావాస ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్‌రాజ్‌పల్లి హ్యాంలెట్‌లో సింగరేణి తాడిచెర్ల కోల్‌బ్లాక్–2 ప్రాజెక్టు నేపథ్యంలో అసైన్మెంట్‌ భూములను చట్టవిరుద్ధంగా విక్రయిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. భవిష్యత్తులో నష్టపరిహారం పొందాలనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసి అనధికార నిర్మాణాలు చేపడుతున్నారని, దీనివల్ల నిజమైన భూ నిర్వాసితుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో తాడిచెర్లలో జరిగిన అక్రమ నిర్మాణాల కారణంగా నష్టపరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం ఏర్పడిందని గుర్తు చేస్తూ, అదే పరిస్థితి శాత్‌రాజ్‌పల్లిలో పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, కొత్తగా ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ, గ్రామపంచాయతీ, సింగరేణి, పోలీసు శాఖ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాడిచెర్ల కోల్‌బ్లాక్–2ను సింగరేణికి కేటాయించడంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీసుకున్న చొరవకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన కేసరపు రవి.. డేంజర్‌ జోన్‌ నిర్వాసితుల పునరావాసం, శాత్‌రాజ్‌పల్లిలో అక్రమ నిర్మాణాల నియంత్రణ, నిజమైన భూ నిర్వాసితుల హక్కుల పరిరక్షణ అంశాల్లో కూడా ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.