ఇథనాల్ ఫ్యాక్టరీల మూసివేతకు డిమాండ్..

తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి భారీ ర్యాలీ

బెజ్జంకి (ఆంధ్రప్రభ): ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న విష దుర్వాసన, వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ బెజ్జంకి మండల ప్రజలు సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫ్యాక్టరీలను వెంటనే మూసివేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ ఆందోళనలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సర్పంచులు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల కారణంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, కాలుష్య నియంత్రణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఆందోళనకారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోరారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కాలుష్యంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.