నేడు సోమవార మాస శివరాత్రి.. శివాలయాల్లో ఆధ్యాత్మిక వైభవం
ఆరుద్ర నక్షత్రం, ధ్రువ యోగంతో విశిష్టమైన పుణ్యదినం.. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: నేడు “ఓం నమః శివాయ…” నామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగుతున్నాయి. ఆషాఢ మాస కృష్ణ పక్ష చతుర్దశి సందర్భంగా ఈరోజు జూలై 13, 2026, సోమవారం దేశవ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సాధారణ మాసశివరాత్రితో పోలిస్తే, ఈసారి సోమవారం రోజునే మాస శివరాత్రి రావడం, ఆరుద్ర నక్షత్రం, ధ్రువ యోగం కలిసి రావడం వల్ల ఈ రోజు శివారాధనకు విశిష్టమైనదిగా శైవ ఆగమ పండితులు పేర్కొంటున్నారు. భక్తులు తెల్లవారు జాము నుంచే శివాలయాలకు తరలి వెళ్లి పరమ్మేశ్వరుడికి అభిషేకాలు, అర్చనలు, బిల్వదళ పూజలు నిర్వహిస్తూ పరమేశ్వరుని స్మరిస్తూ తరిస్తున్నారు.
శైవ సంప్రదాయంలో ప్రతి నెలా వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా ఆచరిస్తారు. అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజునే ఈ తిథి రావడం విశేషంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, మహామృత్యుంజయ మంత్ర జపం, శివపంచాక్షరి మంత్ర పారాయణం, రుద్రాధ్యాయ పఠనం చేస్తే మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. పంచాంగాల ప్రకారం ఈ రోజు ధ్రువ యోగం కూడా ఉండటంతో శుభకార్యాలు, శివారాధనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో సంచరించడం శివభక్తులకు మరో విశిష్టతగా భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలు ఈ సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, బిల్వార్చనలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా వేదఘోషలు, శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వేచి దర్శనం చేసుకుంటున్నారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. భక్తులు కోడెమొక్కులు చెల్లించుకుంటూ, ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, లింగార్చనలు, శివపార్వతుల ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు-కేతు పూజలతో పాటు ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, యాగంటి ఉమా మహేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి, పట్టిసీమ వీరేశ్వరస్వామి తదితర శైవక్షేత్రాల్లో కూడా ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, శివసహస్రనామ పారాయణాలు కొనసాగుతున్నాయి.
సాయంత్రం ప్రదోషకాలంలో శివారాధనకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఈ సందర్భంగా అనేక ఆలయాల్లో ప్రదోష పూజలు, దీపారాధనలు, నంది ప్రదక్షిణలు, శివపార్వతుల ఉత్సవ సేవలు, భజన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పలు దేవాలయాల్లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు, తీర్థప్రసాదాల పంపిణీ, రుద్రాక్షల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి.
బిల్వదళం, స్వచ్ఛమైన నీరు, పంచాక్షరి మంత్రంతో చేసే సాధారణ అభిషేకం కూడా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజు కోపం, అసూయ, అహంకారం వంటి ప్రతికూల భావాలను విడిచిపెట్టి, క్షమ, దయ, సేవాభావంతో శివస్మరణలో గడపాలని పండితులు సూచిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన శైవక్షేత్రాల్లో అదనపు దర్శన క్యూలు, తాగునీటి సౌకర్యాలు, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ కేంద్రాలను విస్తరించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. భక్తులు ఆలయ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని దేవస్థానాలు భక్తులకు తెలియజేస్తున్నాయి.
సోమవార మాస శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న “హర హర మహాదేవ… ఓం నమః శివాయ” నినాదాలు శైవభక్తిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సోమవారం, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, ధ్రువ యోగం కలిసిన ఈ విశిష్టమైన పుణ్యదినాన శివదర్శనం, రుద్రాభిషేకం, బిల్వార్చన, దానధర్మాలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని శైవాగమ పండితులు పేర్కొంటున్నారు.
