డ్యాన్స్ మాస్ట‌ర్ల డిష్యూం.. డిష్యూం.. !!

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.

అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల నమోదు, అంతర్గత పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజాగా ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం ప్రకారం, జానీ మాస్టర్ వర్గం అసోసియేషన్ నిర్వహణలో జరుగుతున్న కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ నాయకులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసోసియేషన్ వ్యవహారాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఫెడరేషన్ అనుమతి లేకుండానే ఉప ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో అసోసియేషన్‌కు చెందిన కొందరు సభ్యులు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి, సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అసోసియేషన్‌ను ముందుకు నడిపించాలని సినీ పరిశ్రమకు చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.