ఇంద్రకీలాద్రిపై వైభవంగా సూర్యోపాసన సేవ…
లోకకల్యాణం, భక్తుల ఆయురారోగ్యాల కోసం…
శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు
అరుణ పారాయణం, మహాసౌర పారాయణం…
సూర్య అష్టోత్తర శతనామావళితో మారుమోగిన ఆలయ ప్రాంగణం..
కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక హారతులు…
సూర్యోపాసనతో ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత..
పెద్దఎత్తున పాల్గొన్న భక్తజనం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం, భక్తుల ఆయురారోగ్యాలు, సర్వజన సుఖశాంతి కోసం నిర్వహించిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆదిత్య భగవానుడి అనుగ్రహం పొందారు. ఆలయ వేద పండితులు అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళిని భక్తిపూర్వకంగా పారాయణం చేస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, ఆయుష్షు, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని వేద పండితులు తెలిపారు. ముఖ్యంగా ఆదివారం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో ఈ సేవకు విశేష ప్రాధాన్యత ఉందని వివరించారు. సూర్యోపాసన అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి, ఆదిత్య భగవానుడి ఆశీస్సులు పొందారు.
