యువత పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి

ఆ..ఆ.. (ఒక అపరిమిత ప్రేమ కథ) పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, మండలి బుద్ధ ప్రసాద్, గద్దె క్రాంతికుమార్

పటమట ఆంధ్రప్రభ : సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న నేటి తరం యువత తెలుగు పుస్తకాలను చదవడం కూడా అలవాటు చేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. వెస్టిన్‌ జూనియర్‌ కళాశాల ఆవరణలో రచయిత్రి డాక్టర్‌ భావన మధుసూదన్‌ తొలి తెలుగు నవల ఆ..ఆ.. (ఒక అపరిమిత ప్రేమ కథ) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, గద్దె రామమోహన్, టీడీపీ యువత విభాగం నాయకులు గద్దె క్రాంతి కుమార్‌ హజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమమునకు గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం అనంతరం 4వ డివిజన్ కు చెందిన బొబ్బా వాసు సొంత నిధులు, రూ.40 వేలతో కొనుగోలు చేసిన రెండు తోపుడు బళ్లను నిరుపేద కుటుంబాలకు చెందిన ఇస్మాయిల్, మహమ్మద్ ఈదై జెన్నిసాకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చేతుల మీదుగా అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ డాక్టర్‌ భావన మధుసూదన్‌ నవలను చాలా అద్భుతంగా రాశారన్నారు. ఇంకా మరిన్ని మంచి నవలలను సమాజానికి అందించి పాఠకుల ఆదరణ పొందాలని ఆశీర్వదించారు. యువత పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగులో ఉన్న గొప్ప పుస్తకాలు, నవలలను యువత చదవడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఈ నవలా రచయిత్రి పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా తెలుగు నేర్చుకుని ఈ పుస్తకాన్ని చాలా చక్కగా రాశారని అభినందించారు.
టీడీపీ యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రంలో ఉండి కూడా తెలుగులో ఈ పుస్తకాన్ని రాయడం చాలా అభినందనీమయమన్నారు. ప్రేమ గురించి చాలా చక్కగా నవలలో రాశారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నవలను చదవాలన్నారు. ఇంట్లో పిల్లలను కూడా తెలుగులో రాయడం, చదవడం నేర్పించాలన్నారు.
ఈ కార్యక్రమములో రచయిత్రి కుటుంబ సభ్యులు, ఇతర ఆహూతులు పాల్గొన్నారు.